ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
తొర్రూరు రూరల్, (ఆంధ్రప్రభ): ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తొర్రూరు పట్టణ 10వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే సమాజానికి నిజమైన సంపద అని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తున్న న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.
శిబిరంలో డా. సురేష్ ఆధ్వర్యంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
