వరద నీటిలో ముప్పనపల్లి.. నరకయాతనలో బాధిత కుటుంబాలు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన నారెడ్ల లింగమూర్తి, చింతగుట్ల సుమన్, కటకం ధనలక్ష్మి కుటుంబాల ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ఆవరణలతో పాటు గదులన్నీ బురద నీటితో నిండిపోవడంతో మంచాలు, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు తడిసి దెబ్బతిన్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతుండగా, కొన్ని కుటుంబాలు ఇళ్లను వీడి వెళ్లలేక వరద నీటిలోనే కాలం గడుపుతున్నాయి.

ఇళ్లలో చేరిన వరద నీటిని బయటకు పంపించే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని వెంటనే సందర్శించి వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టడంతో పాటు బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయం, అవసరమైన నిత్యావసర వస్తువులు అందించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.