రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్

కేసముద్రం, ఆంధ్రప్రభ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతుల రమేశ్ డిమాండ్ చేశారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ రమేష్ మాట్లాడుతూ వానాకాలం (ఖరీఫ్) సీజన్ 2026 ప్రారంభమై రోజులు గడుస్తున్న ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక రూపొందించకపోవడం విచారకరమన్నారు. విత్తనాలు విత్తె నాటినుండి మార్కెట్లో కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రతి దశలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.

ఏ ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణం పంట వేయాలి ఎరువులు లభ్యత ఎంత కొనుగోలు కేంద్రాలు ముందస్తు ఏర్పాట్లు ఏమిటి అంశాలపై రైతులకు ముందే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విత్తనాలు సీజన్ ప్రారంభమైందని, కావున రైతులకు నాణ్యత లేని విత్తనాలను అంటగడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నకిలి విత్తనాలను రైతులకు అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు ముందుస్తు చర్యలు తీసుకొని ,నకిలీ విత్తనాల విక్రయాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతులకు నాణ్యమైన దిగుబడి వచ్చే విత్తనాలు అందజేయాలని కోరారు. అంతేగాక కొందరు విత్తన సరఫరా బ్రోకర్లుగా వ్యవహరిస్తు పత్తి, మిర్చి, వరి విత్తనాలు నకిలీ విత్తనాలు రైతులకు మాయ మాటలు చెప్పి అమ్ముతున్నారని పేర్కొన్నారు. రైతులు పెట్టుబడి అంతా పెట్టి దిగుబడి రాకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

రబీ సీజన్ లో పెండింగ్ లో ఉన్న రైతు భరోసా, ఇప్పుడు జూన్ ఖరీఫ్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేయాలని కోరారు. రైతులందరికీ రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేయాలి. అలాగే రూ. 2 లక్షలు దాటిన బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ప్రతి ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం అందించాలి.యాప్‌ల ద్వారా ఎరువులు తీసుకోవడం రైతులకు భారంగా మారింది. కాబట్టి యాప్స్ వాడలేని రైతుల నుండి వ్యవసాయ అధికారులు ముందే భౌతిక దరఖాస్తులను సేకరించి, ఆ మేరకు ఎరువులు సరఫరా చేయాలని వారు కోరారు.

యూరియా మరియు ఇతర రసాయన ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులను ఆదుకోవడానికి పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..కేసముద్రం మండలంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న బకాయిల మొత్తాన్ని ఎలాంటి సాంకేతిక సాకులు చెప్పకుండా తక్షణమే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి . ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌ మద్దతు ధరతో పాటు, వాగ్దానం చేసిన అదనపు బోనస్ మొత్తాన్ని కూడా కలిపి ఒకేసారి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రమేష్ హెచ్చరించారు.