అంధకారంలో మూడు మండలాలు

అంధకారంలో మూడు మండలాలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం డంపింగ్ యార్డ్ వద్ద విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వినియోగదారులను చీకట్లోకి నెట్టింది. డంపింగ్ యార్డ్‌లోని చెత్తకు నిప్పు అంటుకోవడంతో, ఆ వేడికి పైన వెళ్తున్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడింది. దీని ప్రభావంతో మచిలీపట్నం రూరల్, బంటుమిల్లి మండలంలోని కొంత భాగం, కృత్తివెన్ను మండలాల్లో భారీగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే విద్యుత్ స్తంభాలపై మూడు వేర్వేరు లైన్లు వెళ్తున్నాయి. అయితే, ప్రతిసారి ఈ మూడు మండలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ మాత్రమే కట్ అవుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మిగతా రెండు లైన్లు ఎందుకు కట్ అవ్వడం లేదు? కేవలం ఈ మండలాల లైనే ఎందుకు తెగుతోంది? అని స్థానికులు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ లైన్ కండక్టర్లు పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్లే తరచూ ఇలా జరుగుతోందని, అధికారులు లోతుగా అధ్యయనం చేస్తే అసలు విషయం బయటపడుతుందని ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది కాలంలో సుమారు 6 నుండి 7 సార్లు ఇదే ప్రాంతంలో కండక్టర్ తెగిపోయినట్లు సమాచారం. విద్యుత్ బిల్లుల వసూళ్లపై చూపే శ్రద్ధ, దెబ్బతిన్న కండక్టర్ల మార్పిడిపై చూపకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
