భోగాపురం.. భవిష్యత్తుకు చుక్కాని..!
- మంత్రి కందుల దుర్గేష్
- ఋషికొండలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కర్టెన్ రైజర్ వేడుకలు..
- ఆకట్టుకున్న సాండ్ ఆర్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో “కర్టెన్ రైజర్” కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆగస్టు 1న (రేపు) భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో.. పర్యాటక శాఖ చేపట్టిన ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమం ఆహుతులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాలంటే అభివృద్ధి, రవాణా అనుసంధానత (కనెక్టివిటీ) ఎంతో అవసరం. రైలు, రోడ్డు, ఆకాశ, జల మార్గాల ద్వారా సమర్థవంతమైన కనెక్టివిటీ ఏర్పడితే పరిశ్రమలు వస్తాయి, పర్యాటకరంగం విస్తరిస్తుంది, తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎంతో ఆనందదాయకం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” అని నామకరణం చేశారని గుర్తుచేస్తూ, ప్రజా కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని” మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతన్నలకు కృతజ్ఞతలు తెలుపుతూ సైకత శిల్పంలో “థాంక్స్ ఫార్మర్స్” అని సముచితంగా పొందుపరచడం అభినందనీయం అని మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నమూనాను సైకత శిల్పంగా మలచడం అద్భుతంగా ఉందని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పచ్చదనం, పరిశుభ్రత, పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఋషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు పొందడం గర్వకారణం అని పేర్కొన్నారు.
బీచ్‌ను నిరంతరం శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వల్లే ఈ గుర్తింపు కొనసాగుతోందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్యాటకులు ఎవరూ ప్లాస్టిక్ వ్యర్థాలను బీచ్‌లో పడేసి దీని ఔన్నత్యాన్ని దెబ్బతీయవద్దని, ప్లాస్టిక్ వల్ల గుర్తింపు కోల్పోతే రాష్ట్రానికే అప్రతిష్ట వస్తుందని హితవు పలికారు. ఋషికొండ బీచ్ వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
దాదాపు 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ట్రస్ట్ తరఫున చిన్నారులు చేసిన అద్భుతమైన నృత్య కార్యక్రమాలను, గిరిజన నృత్య కళారూపాలను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. సాంప్రదాయ కోలాటంతో తనకు స్వాగతం పలికిన మహిళామణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. మన ఎయిర్‌పోర్ట్ మన భవిష్యత్” పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద, సైకత శిల్పాల వద్ద మంత్రి కందుల దుర్గేష్ ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన సిగ్నేచర్ వాల్‌పై తన సంతకాన్ని తెలుగులో చేశారు.
అంతర్జాతీయ పర్యాటకుల రాకను పెంచేందుకు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో స్థానిక పర్యాటక రంగానికి ఉన్న అనుసంధానాన్ని వివరిస్తూ పర్యాటక శాఖ రూపొందించిన కార్యక్రమాలు, ఏపీ పర్యాటక విశేషాల ప్రదర్శనలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉత్తరాంధ్ర టూరిజం శాఖాధికారులను మంత్రి దుర్గేష్ అభినందించారు.
ఈ వేడుకలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, టూరిజం అండ్ ట్రావెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ మోహన్, హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ కార్తీక్, డివిఎం జగదీష్, జనసేన పార్టీ నాయకులు సందీప్, శ్రీనివాస్ మరియు ఇతర పర్యాటక శాఖ అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున పర్యాటకులు పాల్గొన్నారు.

