13 ఏళ్ల బాలిక గర్భం.. పుత్తూరులో కలకలం

  • పోక్సో చట్టం కింద కేసు నమోదు..
  • పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పుత్తూరు, ఆంధ్రప్రభ: పుత్తూరు మండలం పరిధిలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక సమాచారం మేరకు.. బాధిత బాలిక తన బాబాయి హరికృష్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధిత బాలికను తమ సంరక్షణలోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం తరలించారు.

ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలు మైనర్ కావడంతో ఆమె గుర్తింపునకు సంబంధించిన వివరాలను వెల్లడించకుండా విచారణ కొనసాగిస్తున్నారు.