వరద నీటిలో చిక్కుకున్న 30 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు
- ఛత్తీస్‌గఢ్‌లో ప్రకృతి బీభత్సం..
- ఒక్కసారిగా బీఎస్‌ఎఫ్ క్యాంపులోకి వచ్చిన వరద నీరు
- చెట్లు, షెడ్లపై గంటల తరబడి ప్రాణపోరాటం
- ఉప్పొంగిన కుకూర్ నది ముంచెత్తిన భద్రతా శిబిరం
- వరద తగ్గిన తర్వాత సహాయక చర్యలు..
- జవాన్లందరూ క్షేమంగా బయటకు..
చింతూరు (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ: ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఉప్పొంగిన వరదల్లో చిక్కుకుని 30 మంది బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) జవాన్లు గంటల తరబడి ప్రాణభయంతో గడిపిన ఘటన కలకలం రేపింది. చివరకు సహాయక బృందాల సాయంతో జవాన్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అధికారులు, సహచర సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత దట్టమైన అటవీ ప్రాంతమైన అబూజ్‌మాడ్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి వేదికైంది. నారాయణ్‌పూర్ జిల్లా బాలేబెడ గ్రామంలో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్ 86వ బెటాలియన్ భద్రతా శిబిరం వద్ద పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా కుకూర్ నది నీటిమట్టం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. క్షణాల్లో ఉప్పొంగిన వరదనీరు బీఎస్‌ఎఫ్ శిబిరాన్ని చుట్టుముట్టి ప్రాంగణంలోకి దూసుకొచ్చింది.
చెట్లపైకి ఎక్కి ఆశ్రయం
వరద ఉధృతి అంత తీవ్రంగా ఉండటంతో శిబిరంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడే ఉన్న నివాస షెడ్ల పైకప్పులు, చెట్లపైకి ఎక్కి ఆశ్రయం పొందారు. భారీ వర్షం మధ్య గంటల తరబడి అక్కడే ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విపత్కర సమయంలో షెడ్ల పైకప్పులు, చెట్లే వారికి ప్రాణరక్షకులుగా మారాయి.
అదృష్టవశాత్తూ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన స్థానిక గ్రామస్తులు సమీపంలోని ఎత్తైన కొండ ప్రాంతాలకు తరలిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఒకవైపు నక్సలిజాన్ని అణిచివేసేందుకు భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహిస్తుండగా, మరోవైపు అబూజ్‌మాడ్ వంటి అత్యంత మారుమూల, దుర్భేద్య అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు ప్రకృతి విపత్తులు కూడా తీవ్ర సవాల్‌గా మారుతున్నాయి. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తించే జవాన్లు భద్రతాపరమైన ముప్పులతో పాటు ప్రకృతి వైపరీత్యాలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నారనే విషయం ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
30 మంది జవాన్లను సురక్షితం
వరదనీటి ఉధృతి క్రమంగా తగ్గిన అనంతరం సమీపంలోని పరయాది బీఎస్‌ఎఫ్ క్యాంప్ నుంచి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వారి సహాయంతో బాలేబెడ శిబిరంలో చిక్కుకున్న 30 మంది జవాన్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో జవాన్లందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
దుర్భరమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలను లెక్కచేయకుండా కర్తవ్య నిర్వహణలో అచంచలంగా నిలిచిన బీఎస్‌ఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలు దేశ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి.
