ఎస్ఐఆర్ గడువు పొడిగింపు..
- ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు మరో అవకాశం
- అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకు పొడిగించింది. ఓటర్లు తమ వివరాలను ఆ తేదీలోపు సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వోలు) అందజేయాలని సూచించింది. అలాగే బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా (డ్రాఫ్ట్ పబ్లికేషన్) విడుదల చేయనుంది. అనంతరం సెప్టెంబర్ 16 వరకు క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించనుంది. అందిన క్లెయిములు, అభ్యంతరాలను ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపింది. అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
