పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం
- శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించిన ఎస్పీ సుబ్బరాయుడు
- పదవీ విరమణ తర్వాత సమాజ సేవలో కొనసాగాలని సూచన
తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా పోలీస్ శాఖలో 36 నుంచి 44 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన నలుగురు పోలీస్ అధికారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఎస్పీ సుబ్బరాయుడు వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం కేవలం వృత్తి మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తులు, శాంతిభద్రతలను కాపాడే అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని అన్నారు. మూడు, నాలుగు దశాబ్దాలకు పైగా ఎలాంటి మచ్చ లేకుండా క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం ప్రతి పోలీస్ అధికారికి గర్వకారణమని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల విజయవంతమైన సేవా ప్రయాణంలో వారి కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ తెలిపారు.
పోలీస్ కుటుంబాల త్యాగం కూడా సమాజానికి చేసిన గొప్ప సేవేనని అన్నారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే ముగింపు అని, సేవాస్ఫూర్తికి కాదని ఎస్పీ పేర్కొన్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌తో పాటు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులు డీఎస్పీ వై.శ్యామ్ సుందరం (44), ఏఎస్ఐ దయానిధి నాయుడు (43), ఎస్‌ఐ కె.బాలాజీ (40), హెడ్ కానిస్టేబుల్ ఎ.ఆరుముగం (36) మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పనిచేయడం తమ జీవితంలో గౌరవప్రదమైన అవకాశమని, ఈ సన్మానం జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు (పరిపాలన), రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), ఐ.రామకృష్ణ (తిరుమల), శ్రీనివాసరావు (ఏఆర్), ఎస్‌బీ డీఎస్పీ గీతాకుమారి, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు సోము, శంకర్ రెడ్డి, శేఖర్‌తో పాటు పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
