సమయపాలనలో సరికొత్త రికార్డు..

చరిత్ర సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్
ఒక్కరోజులోనే 97.35 శాతం రైళ్ల సమయపాలనతో సరికొత్త రికార్డు….
192 రైళ్ల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు..
గత రికార్డుకు చెక్ పెడుతూ…
ఉద్యోగుల సమిష్టి కృషి, సమన్వయ ఫలితమే విజయమన్న డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా..
ప్రయాణికులకు మరింత విశ్వసనీయ, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం
భారతీయ రైల్వేలో అత్యంత రద్దీ మార్గంలోనూ అద్భుత సమయపాలన

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటైన విజయవాడ రైల్వే డివిజన్ సమయపాలనలో చరిత్ర సృష్టించింది. జూలై 6న నిర్వహించిన 192 రైళ్లలో 97.35 శాతం సమయపాలన నమోదు చేసి డివిజన్ ఇప్పటివరకు సాధించిన అత్యుత్తమ ఒక్కరోజు రికార్డును నెలకొల్పింది. గతంలో 2025 ఆగస్టు 6న 181 రైళ్ల నిర్వహణలో నమోదైన 97.24 శాతం రికార్డును అధిగమిస్తూ కొత్త మైలురాయిని అందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్ మరోసారి తన నిర్వహణా సామర్థ్యాన్ని చాటుకుంది. జూలై 6న మొత్తం 192 రైళ్లను నిర్వహిస్తూ 97.35 శాతం సమయపాలన సాధించడం ద్వారా డివిజన్ చరిత్రలోనే అత్యుత్తమ ఒక్కరోజు రికార్డును నమోదు చేసింది.

సమర్థవంతమైన నిర్వహణ…

ఈ విజయానికి సమర్థవంతమైన రైళ్ల నిర్వహణ, ముందస్తు కార్యాచరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, రైల్వే ఉద్యోగుల అంకితభావంతో కూడిన కృషి ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు. అధిక రైళ్ల రద్దీ, సంక్లిష్టమైన నిర్వహణ పరిస్థితుల మధ్య కూడా సమయపాలనలో అత్యున్నత ప్రమాణాలు పాటించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా అధికారులు, ఉద్యోగులను అభినందించారు. డివిజన్ ఉద్యోగుల క్రమశిక్షణ, సమిష్టి కృషి, అంకితభావానికి ఈ రికార్డు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటిలో ఇంతటి సమయపాలన సాధించడం ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, నాణ్యమైన సేవలందించాలనే రైల్వే సంకల్పానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన నిర్వహణా ప్రమాణాలతో ప్రయాణికుల సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు విజయవాడ రైల్వే డివిజన్ కట్టుబడి పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.