పీఆర్సీ, పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి

  • రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేతకు స్వస్తి పలకాలి
  • టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకుల డిమాండ్

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, ఆరు డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. వెంకటాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం మోత్కూర్ మండలంలో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ నెలకొందని అన్నారు. ఆలస్యం చేయకుండా పీఆర్సీని ప్రకటించి, బకాయిలో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని కోరారు. అలాగే ఎంప్లాయీ హెల్త్ కార్డుల అమలులో జాప్యాన్ని నివారించి, స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే చర్యలను విరమించి, వాటి బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని వెంకటాచారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు దర్శనం వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఏ. సత్తయ్య, సహాధ్యక్షుడు ఉప్పలయ్య, కార్యదర్శి తిరుపతి, సీనియర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.