గంజాయితో దొరికిన ఈగిల్ టీం కానిస్టేబుల్
- వివరాలు వెల్లడించిన ఏసిపి విజయ్ కుమార్
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల నియంత్రణ విభాగంలో పనిచేస్తూ స్నేహితుని కోసం అతని ప్రత్యర్థి పై అక్రమ కేసు పెట్టేందుకు గంజాయి నిల్వచేసిన ఈగల్ టీం కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుని వివరాలను కొత్తపెళ్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఏసిపి విజయ్ కుమార్ వెల్లడించారు.
కరీంనగర్ మండలం సీతారాంపూర్ లో నివాసముంటున్న ఈగల్ టీం కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు వద్ద గంజాయి నిల్వ ఉందన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 370 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగరాజును విచారించగా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు చెందిన శ్రీనివాస్ కు నాగరాజుకు పరిచయం ఉంది.
అదే గ్రామంలో శ్రీనివాస్ కు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తులకు మధ్య భూతగాదాలు ఉండడంతో అవి ఎన్నిసార్లు పంచాయతీ నిర్వహించిన కొలిక్కి రాకపోవడంతో అతన్ని కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో నాగరాజు శ్రీనివాసులు కలిసి పథకం పన్నారు. స్నేహితుని కోసం కానిస్టేబుల్ నాగరాజు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఎరువుల దుకాణంలో పెట్టాడు.
తిరిగి పోలీసులకు సమాచారం అందించి చిరుమామిడి పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యేలా చేసి కటకటాల పాలు చేశారు. వరంగల్ నుంచి తెప్పించిన గంజాయిలో కిలో గంజాయి శ్రీనివాస్ రెడ్డి దగ్గర దొరికినట్లు చూపించగా మిగిలిన 3 70 గ్రాముల గంజాయిని తన ఇంట్లో నిల్వ ఉంచుకున్నాడు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజు ఇంట్లో దాడులు నిర్వహించి గంజాయి తోపాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామని ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ఏసీబీ వెంట కొత్తపల్లి ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ పాల్గొన్నారు.
