లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

  • మంగపేట హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం
  • 28 కుటుంబాలకు చెందిన వంద మందికి వసతి, భోజన సౌకర్యాలు

ములుగు జిల్లా, ఆంధ్రప్రభ : గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో మంగపేట మండలంలోని పొదుమూరు లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రానికి తరలించారు. మంగపేట మండల కేంద్రంలోని మంగపేట ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి పొదుమూరు గ్రామంలోని 28 కుటుంబాలకు చెందిన సుమారు 100 మందిని రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు సురక్షితంగా తరలించారు. శుక్రవారం రాత్రి నుంచే వారికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు.

గోదావరి వరద ఉద్ధృతి కారణంగా పొదుమూరు లోతట్టు ప్రాంతంలోని పలు ఇళ్లకు ముంపు ముప్పు పొంచి ఉండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య (ఎంఎస్‌వో), తహసీల్దార్ తోట రవీందర్, ఎస్‌ఐ టి.వి.ఆర్. సూరి, ఎంపీడీఓ బద్రు నాయక్, గ్రామపంచాయతీ అధికారి బి. సురేష్ ఆధ్వర్యంలో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.