మద్యం తాగి.. కుటుంబాన్ని రోడ్డున పడేసి

మద్యం తాగి.. కుటుంబాన్ని రోడ్డున పడేసి

  • వ్యసనానికి బానిసై వ్యక్తి మృతి

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ: మద్యానికి బానిసై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కరీంనగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో వెల్గటూరు మండలం సిరికొండ గ్రామానికి చెందిన కేతిరెడ్డి చుక్కారెడ్డి (46) అనే వ్యక్తి మృతి చెందాడు. గత ఆరు సంవత్సరాల క్రితం నుంచి మృతుడు మద్యానికి తీవ్రంగా బానిస కావడంతో అతని భార్య శారద అతనితో కాపురం చేయలేక తన కూతురు రమ్యను తీసుకొని పుట్టింటికి వెళ్లి పోయిందన్నారు. మృతునికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరు లేకపోవడంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగే వాడన్నారు.

ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేవాడని తెలిపారు. సోమవారం ఉదయం కరీంనగర్ చౌరస్తాలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్లూ కోట్ పోలీసులు అక్కడికి వెళ్లి చూసి మృతుని జేబులు చెక్ చేయగా అందులో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలియడంతో కుటుంబీకులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. మృతుని భార్య శారద తన భర్త మద్యానికి బానిసై సరైన సమయానికి తిండి దొరకక చనిపోయాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave a Reply