పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు…
కూపన్లు తప్పనిసరి.. క్యాన్లలో ఇంధన సరఫరాపై కఠిన నిబంధనలు అమలు… జిల్లా ఎస్ పి కలెక్టర్..

నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఐఓసిఎల్, బిపిసిఎల్,హెచ్‌పిసిఎల్, వంటి పలు పెట్రోల్ బంకులను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరానికి అనుగుణంగా అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సరఫరా సజావుగా కొనసాగుతున్నందున, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 223 పెట్రోల్ బంకులు పనిచేస్తుండగా, వాటిలో 33 రిలయన్స్, 2 జియో బంకులు ఉండగా, మిగిలినవి ఐఓసిఎల్ , బిపిసిఎల్ , హెచ్‌పిసిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు. అన్ని బంకుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ధృవీకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయంలో తాత్కాలికంగా డీజిల్ నిల్వలు తగ్గిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులతో సమన్వయం చేసి, సాయంత్రం 5 గంటల కల్లా అన్ని బంకుల్లో సరఫరా సాధారణ స్థితికి తీసుకువస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

ఇంధనాన్ని కాన్లలో సరఫరా చేయడంపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసం హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ కావాలంటే సంబంధిత వ్యవసాయ అధికారి మరియు తహసీల్దార్ ధృవీకరించిన కూపన్ తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి బంక్ వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులను పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. పెట్రోల్, డీజిల్‌ను లూజ్‌గా క్యాన్లు, బాటిళ్లలో విక్రయించడం పూర్తిగా నిషేధించామని, కేవలం అధికారుల ధృవీకరణ ఉన్న కూపన్‌తోనే రైతులకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నందున ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దన్నారు.అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేయకుండా సహకరించాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply