డాక్టరేట్ పట్టా అవార్డ్ గ్రహీతకు ఘన సన్మానం..

దండేపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన గరిసందుల లింగయ్య, శంకరమ్మల కుమార్తె గరిసందుల సరిత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె వనపర్తి జిల్లా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గూడ అంజయ్య జీవితం, సాహిత్యంపై పరిశోధన చేసి సరిత డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె స్వగ్రామమైన మామిడిపల్లిలో గ్రామ సర్పంచ్ ఎల్తపు వైష్ణవి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సరితతో పాటు ఆమె భర్త సురేందర్, కుటుంబ సభ్యులు శంకరమ్మ, లక్ష్మణ్‌లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన సరిత ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే ఆమె భర్త సురేందర్ కూడా డాక్టరేట్ పొందడం వారి కృషి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు అలిశెట్టి లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ నూర తిరుపతి, వార్డు సభ్యులు గొట్ల మహేందర్, జిల్లపెల్లి భానుచందర్, జిల్లపెల్లి శేఖర్, గ్రామస్థులు గాలిపెల్లి సత్యనారాయణ, కొదురుపాక గంగన్న, కొమిటిపెల్లి యుగంధర్, సూదుల లక్ష్మణ్, మెరుగు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply