ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు కమిటీ ఆవరణలో ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు , ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జైనూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ చిత్రపటంతో పాటు ఇతర మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు సమాజంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షులు మావాలే దత్తమాంగ్, జైనూర్ మాజీ వైస్ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్ యాదవ్, రషీద్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, బంజారా సంఘం రాష్ట్ర నాయకులు గోపీనాథ్ గీత్తే, కాంగ్రెస్ యువ నాయకులు మెస్రం అంబాజీరావు పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ అసోసియేషన్ నాయకులు జనార్ధన్, అన్నారావ్, కిరణ్, వెంకటేష్, సిద్దు, బాబాసాహెబ్ మరియు అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
