గురుపౌర్ణమికి ఏకైక ఆరాధ్యుడు శ్రీకృష్ణ భగవానుడు

గురుపౌర్ణమికి ఏకైక ఆరాధ్యుడు శ్రీకృష్ణ భగవానుడు

మోత్కూర్, ఆంధ్రప్రభ: త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక భువనగిరి, చేర్యాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం మోత్కూర్ మండలంలోని సదర్ షాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు గ్రామంలో త్రైత సిద్ధాంత భగవద్గీత, దాని అనుబంధ గ్రంథాల ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహించారు. మానవాళికి దిశానిర్దేశం చేసిన శ్రీకృష్ణుడిని మాత్రమే జగద్గురువుగా ఎందుకు పూజించాలో, ఆయనకున్న విశిష్టత, గొప్పతనాన్ని గ్రామ ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వేత్తలు మాట్లాడుతూ పూర్వకాలంలో ‘గురువు గుండ్రాయి లాంటి వాడు’ అని సామెతగా అనేవారని గుర్తుచేశారు. ఆది అంత్యము లేని గుండ్రాయికి మొదలు, చివర అనేవి ఎలా ఉండవో.. గురువు స్థానం కూడా అంతే అపరిమితమైనదన్నారు. సాక్షాత్తు దేవుడే మనిషిగా జన్మిస్తే ఆయనను మాత్రమే నిజమైన గురువుగా భావించాలన్నారు. ఆషాడ మాసంలో చంద్రుడు గుండ్రంగా, పెద్దగా ప్రకాశిస్తూ ఉండటం వల్ల ఆ రోజును గురుపౌర్ణమిగా నిర్ణయించారని చెప్పారు. లోక రక్షకుడైన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిని మాత్రమే జగద్గురువుగా భావించి భక్తిశ్రద్ధలతో గురు పూజ చేయాలని పిలుపునిచ్చారు.

భగవద్గీత సారాన్ని ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో అలవర్చుకోవాలని కోరారు. ఈ ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక భువనగిరి, చేర్యాల కమిటీ సభ్యులు దేవేందర్, శివరామకృష్ణ, లింగస్వామి పాల్గొన్నారు. వీరితో పాటు సాయి రాజు, జయమ్మ, సుకన్య, లత తదితర భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.