వైసీపీపై రాప్తాడు టిడిపి నేతల ఆగ్రహం
వైసీపీపై రాప్తాడు టిడిపి నేతల ఆగ్రహం
రాప్తాడు, ఆంధ్రప్రభ : ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండదని హిందూపురం టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎస్సీ సెల్ నాయకుడు పాలచెర్ల ముత్యాలప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.రాప్తాడు మండల కేంద్రంలో ఎస్సీ సెల్ నాయకులు పాలచెర్ల ముత్యాలప్ప సోమలదొడ్డి మంత్రి సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో ఎస్సీలపై ఇదే మే నెలలో జరిగిన సంఘటనలను రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఎప్పటికీ మరువలేరన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వద్ద మాజీ డ్రైవర్ గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంకు సదరు ఎమ్మెల్సీతో తలెత్తిన వివాదం కారణంగా హత్యకు గురైన సంఘటన నేటికీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తోందన్నారు.
హత్య చేసి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకొచ్చి వాళ్ల ఇంటి వద్దే పడేసి మొదట్లో దీనిని ఒక ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అయితే తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన మరణించాడని దర్యాప్తులో వెల్లడైన విషయం అందరికీ తెలుసునన్నారు. రాజకీయ అండతో అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వారిలో జవాబుదారీతనం ఎంతలా లోపించిందో చెప్పడానికి ఈ ఘటనే స్పష్టమైన నిదర్శనం అని ఎస్సీ సెల్ నాయకులు అన్నారు. ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ కోవిడ్-19 సమయంలో పీపీఈ కిట్లు కొరత గురించి ఆందోళనలు లేవనెత్తిన తర్వాత సస్పెండ్ చేశారన్నారు. అంతటితో వదలకుండా బహిరంగంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆయన్ని అరెస్టు చేశారన్నారు.
తద్వారా వైసీపీ పాలనలో ప్రశ్నించే గొంతుకల అణిచివేతకు మరియు ఎస్సీ వృత్తినిపుణులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఆయన ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయారన్నారు.ఈ ఘటనలన్నీ కలిపి చూస్తే ముఖ్యంగా ఎస్సీ వ్యక్తులు వృత్తిపరమైన నిపుణులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై వైసీపీ హయాంలో నిరంతర బెదిరింపులు దౌర్జన్యాలు మరియు వ్యవస్థాగత అన్యాయాలకు ఇవి అద్దం పట్టాయన్నారు. ఇలా ఇదే మే నెలలో ఎస్సీలను ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న ఏకైక పార్టీ వైసిపి పార్టీ అని ఎస్సీ సెల్ నాయకులు తెలియజేశారు.
