పశువుల అక్రమ రవాణా.. లారీ పట్టివేత

పశువుల అక్రమ రవాణా.. లారీ పట్టివేత

-చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి చెక్ పోస్ట్ వద్ద సోమవారం తెల్లవారుజామున అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక లారీని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ ఎస్ హెచ్ ఓ (ఇన్‌స్పెక్టర్) జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం తెల్లవారుజామున హెడ్ కానిస్టేబుల్ ఎ. నరేష్, ఏఆర్పీసీ సీతారాం రెడ్డిలు పెట్రోమొబైల్ వాహనంలో గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అందిన నమ్మదగిన సమాచారం మేరకు వారు పంతంగి చెక్ పోస్ట్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో విజయవాడ వైపు నుండి చౌటుప్పల్ మార్గంలో వస్తున్న ఒక అశోక్ లేలాండ్ లారీని ఆపి తనిఖీ చేశారు. ఆ లారీలో ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత క్రూరంగా, అక్రమంగా తరలిస్తున్న 9 ఆవులు, 16 ఎద్దులు.. మొత్తం 25 పశువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

లారీ డ్రైవర్ అయిన రంగారెడ్డి జిల్లా జల్పల్లి (సరూర్ నగర్ పరిధి) కి చెందిన మహ్మద్ షఫీ (50) ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఖమ్మం జిల్లా పనితాపురం సంతలో ఈ పశువులను కొనుగోలు చేసి హైదరాబాదుకు తరలిస్తున్నామని, ఈ లారీ యజమాని ఎండి పాషా అని డ్రైవర్ విచారణలో అంగీకరించాడు.

పశువులతో పాటు రవాణాకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు, నిందితులపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు.