కిషోర సిద్ధ సమాధి యోగ శిక్షణ శిబిరం ప్రారంభం
కిషోర సిద్ధ సమాధి యోగ శిక్షణ శిబిరం ప్రారంభం
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: రాచకొండ గుట్టల మధ్యనున్న బ్రీత్ మౌంటెన్ రీట్రీట్ సెంటర్ అరబిందో ఆశ్రమంలో చిన్నారుల కోసం వేసవి శిబిరం బుధవారం ప్రారంభమైంది.
సిద్ధ సమాధి యోగ ఆచార్యులు రవీందర్ బాపూజీ ఆధ్వర్యంలో “కిషోర సిద్ధ సమాధి యోగ” శిక్షణ అందించేందుకు 21 రోజుల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 10 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులకు ఈ శిబిరంలో ఆచార్య సౌజన్య లక్ష్మీ మాతాజీ పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న చిన్నారులను తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేపి సూక్ష్మ వ్యాయామాలు, ధ్యానం, యోగ సాధనలో శిక్షణ ఇస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన పదార్థాలతో అల్పాహారం, భోజనం అందిస్తున్నారు.
శిబిరంలో భాగంగా సనాతన ధర్మం గురించి అవగాహన కల్పించడంతో పాటు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు రవీందర్ బాపూజీ, బ్రీత్ అరబిందో ఆశ్రమ వ్యవస్థాపకుడు అరవింద్ రెడ్డి, మేనేజర్ సలాం ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
