ఎంపీ చిన్ని పై చాలా బాధ్యత ఉంది
ఎంపీ చిన్ని పై చాలా బాధ్యత ఉంది
రాష్ట్రంలో మార్పు కోసమే మేమంతా పని చేస్తున్నాం : మంత్రి నారా లోకేష్
విజయవాడ, ఆంధ్రప్రభ: మొదటిసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన ప్రజాప్రతినిధులపై బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
విజయవాడలోని నోవోటెల్ విజయవాడ వరుణ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అవగాహన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎండీ మరియు సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి లోకేష్‌తో పాటు ఎంపీ కేసినేని చిన్ని, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, పలువురు అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తాను, ఎంపీ చిన్ని, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన వారేనని తెలిపారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే అందరి ఉమ్మడి ఎజెండా అని అన్నారు.
ఎంపీ చిన్ని పై ప్రత్యేక బాధ్యత ఉందని పేర్కొంటూ, ఇటువంటి అవగాహన సదస్సులు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను “స్వర్ణాంధ్రప్రదేశ్”గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని మూడు ప్రధాన ఆర్థిక మండలాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

