అందుకే.. గోదాములను సిద్ధం చేస్తున్నాం

అందుకే.. గోదాములను సిద్ధం చేస్తున్నాం
వలిగొండ, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, మిల్లులో ధాన్యం నిలువలు నిండిపోయాయని, అందుకే ధాన్యం తరలించడంలో కొంత జాప్యం జరుగుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఎద్దులగూడెం గ్రామంలో గల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డిఓ శేఖర్ రెడ్డితో కలిసి సందర్శించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం పై, తరుగు పేరుతో చేస్తున్న మోసం పై ఎమ్మెల్యేకు చెప్పడం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సివిల్ సప్లై జిల్లా అధికారులతో మాట్లాడి లారీల కొరత లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. ధాన్యం నిలువల కోసం తిరుమలగిరిలోని గోదాములను ఏర్పాటు చేయడం జరిగిందని గురువారం నుండి ధాన్యం అక్కడికి వెళుతుందని రైతులకు ఇబ్బంది తప్పుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ధాన్యం తూకం వేయడంలో తేడా వస్తే.. సహించేది లేదన్నారు. వలిగొండ మండలంలో ధాన్యం దిగుబడి అధికంగా రావడం వల్లనే ఈ సమస్య కొంత జటిలం అవుతుందన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొనుగోళ్ల విషయంలో అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు.
మండలంలోని పూసల గోదాంలో లక్ష బస్తాల వరకు నిల్వ చేసే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ నాయక్, తాసిల్దార్ దశరథ నాయక్ ఎస్ఐ యుగంధర్ గౌడ్, వలిగొండ సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, బత్తిని లింగయ్య, పాశం సత్తిరెడ్డి, ఘర్ష రవి, చెరుకు శివయ్య గౌడ్, కొండూరు సాయి, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
