ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలి

-జిల్లా కలెక్టర్ కు వినతి
-మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ను కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ​

ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో “తాలు తూకం” పేరుతో రైతుల నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక కిలోలు తూకం వేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల దళారులు, మిల్లర్లు రైతులను అడ్డంగా వంచిస్తున్నారని, ఈ అక్రమాలను తక్షణమే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ​

రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ​ధాన్యం బస్తాల లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ​కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి నగదును ఆలస్యం చేయకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ​రైతుల పక్షాన పోరాటం ఆగదు, ​రైతులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తానని కూసుకుంట్ల స్పష్టం చేశారు.

జిల్లా యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, రైతులకు న్యాయం చేయాలని ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్కటి నిరంజన్ గౌడ్, నాయకులు గుమ్మాడపు నరసింహరావు, నర్రి నరసింహ, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, తాడూరి పరమేష్, బండ్ల శ్రీకాంత్, శివగోని మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply