దేవలమ్మ నాగారం చెరువు ఆక్రమణపై సర్పంచ్ ఆగ్రహం

దేవలమ్మ నాగారం చెరువు ఆక్రమణపై సర్పంచ్ ఆగ్రహం

పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
చెరువులో 10 ఫీట్ల మేర మట్టి పోసి ఆక్రమిస్తున్న వైనం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలోని చెరువు అక్రమార్కుల పాలువుతోంది. కొంతమంది రైతులు చెరువును ఆక్రమించుకునేందుకు ఏకంగా 10 ఫీట్ల ఎత్తులో మట్టిని పోస్తూ పొలం కోసం మడులు అచ్చుపడుతూ యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ సురుగు గౌరి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

మంగళవారం ఆమె స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి చెరువులో మట్టి పోసి ఆక్రమిస్తున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ గౌరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… చెరువులో అక్రమంగా మట్టి పోస్తున్న విషయాన్ని పలుమార్లు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

​అధికారుల అండతోనే ఆక్రమణలు: కాంగ్రెస్ నేత సురుగు శ్రీనివాస్ గౌడ్
గత 15 రోజులుగా గ్రామ చెరువులో యథేచ్ఛగా మట్టిని పోస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురుగు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సమాచారం ఇస్తే అధికారులు నామమాత్రంగా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప, ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

​ప్రమాదంలో చెరువు కట్ట..

​చెరువులో పెద్ద ఎత్తున మట్టిని కుమ్మరించడం వల్ల నీటి సాంద్రత (నీటి నిల్వ సామర్థ్యం) తగ్గిపోతుందని, రాబోయే వర్షాకాలంలో చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఉందని శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, దేవలమ్మ నాగారం చెరువు ఆక్రమణలను అడ్డుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.