విజయవాడ పశ్చిమలో ఉద్రిక్తత..

టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడి
భవానిపురం ఆసుపత్రిలో చికిత్స
బాధితులను పరామర్శించిన బుద్దా వెంకన్న
(విజయవాడ, ఆంధ్రప్రభ ) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు స్తంభాల సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన 39వ డివిజన్ అధ్యక్షుడు శివశర్మ, నాయకుడు చైతన్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కరిముల్లా, అతని అనుచరులు దాడి చేసినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడిలో గాయపడిన శివశర్మ, చైతన్యలను వెంటనే భవానిపురంలోని భవాని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బుద్ధా వెంకన్న, ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి ఘటనను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు అనర్హమని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనతో విజయవాడ పశ్చిమలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
