16YRS BOY | ఏకంగా తండ్రినే…

16YRS BOY | ఏకంగా తండ్రినే…
16YRS BOY | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చాపాడు మండలంలోని ఓబుల్‌రెడ్డి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని వేధిస్తున్నాడనే ఆవేశంతో 16ఏళ్ల బాలుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామానికి చెందిన బాధితుడు కొంతకాలంగా మద్యానికి బానిసై, నిత్యం ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతూ వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గత రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి భార్యపై దాడికి పాల్పడ్డాడు.
కళ్లముందే తండ్రి తల్లిని వేధిస్తుండటం చూసి తట్టుకోలేకపోయిన మైనర్ కుమారుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న చాపాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడైన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు, మద్యపాన వ్యసనం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
