TeamIndia | ఐపీఎల్ 2027 లోపు టీమ్ ఇండియా ఫుల్ బిజీ…

TeamIndia | ఐపీఎల్ 2027 లోపు టీమ్ ఇండియా ఫుల్ బిజీ…

  • సిరీస్‌ల పూర్తి వివరాలు ఇవే!

క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక‌ పండగే పండగ. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ లోపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం బీసీసీఐ ఖరారు చేసింది. రాబోయే రోజుల్లో మన టీమ్ ఇండియా టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లతో అస్సలు గ్యాప్ లేకుండా బిజీగా గడపనుంది. సొంత గడ్డపై జరిగే మ్యాచ్‌లతో పాటు విదేశీ పర్యటనల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

జూన్ – జూలై 2026: విదేశీ పర్యటనలు

భారత జట్టు తన అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణాన్ని ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభించనుంది. జూన్ 6 నుండి జూన్ 20 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేల సిరీస్ జరగనుంది.

ఆ వెంటనే జూన్ 26 నుండి జూన్ 29 వరకు ఐర్లాండ్ పర్యటనలో 2 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత జూలై 1 నుండి జూలై 19 వరకు ఇంగ్లాండ్ గడ్డపై 5 టీ20లు, 3 వన్డేల పెద్ద సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే జూలై 23 నుండి జూలై 26 వరకు జింబాబ్వేతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తలపడనుంది.

సెప్టెంబర్ – అక్టోబర్ 2026: హోమ్ సిరీస్ & న్యూజీలాండ్ టూర్

సెప్టెంబర్ నెలలో జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ ముగిసిన తర్వాత, వెస్టిండీస్ జట్టు భారత ప‌ర్య‌టన‌కు రానుంది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ సిరీస్‌లో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డే మ్యాచ్‌లు తిరువనంతపురం, గువహటి, చండీగఢ్‌లలో జరగనుండగా.. టీ20 మ్యాచ్‌లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో జరుగుతాయి.

ఈ సిరీస్ ముగిశాక, అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత జట్టు న్యూజీలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ కివీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.

డిసెంబర్ 2026 – జనవరి 2027: శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లు
డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 27 వరకు శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌లో 3 వన్డేలు (ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్), 3 టీ20లు (రాజ్‌కోట్, కటక్, పూణే) జరుగుతాయి.

ఆ తర్వాత కొత్త ఏడాది 2027 ఆరంభంలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. జనవరి 3 నుండి జనవరి 9 వరకు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై వేదికలుగా 3 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.

జనవరి – మార్చి 2027: మెగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’ మన దేశంలోనే జరగనుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ 5 మ్యాచ్‌ల చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ జనవరి 21 నుండి మార్చి 3 వరకు సాగుతుంది.

నాగ్‌పూర్ వేదికగా జనవరి 21న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లు వరుసగా చెన్నై, గువహటి, రాంచీ, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి. ఈ భారీ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే, ఏప్రిల్-మే నెలల్లో ఐపీఎల్ 2027 హంగామా మొదలవుతుంది.