ATM Robbery | ఐఎస్ సదన్‌లో హైటెక్ దోపిడీ

ATM Robbery | ఐఎస్ సదన్‌లో హైటెక్ దోపిడీ

ATM Robbery | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ ప్రాంతంలో సంచలన దోపిడీ ఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలో నగదు నింపుతున్న సమయంలో దుండగులు ఏకంగా రూ.17 లక్షల నగదుతో కూడిన ట్రంక్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. క్యాష్ వ్యాన్ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపేందుకు వెళ్లిన సమయంలో నగదుతో ఉన్న ట్రంక్ పెట్టెను బయట ఉంచారు. ఇదే అదనుగా చూసిన ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ట్రంక్ బాక్స్‌ను తీసుకుని క్షణాల్లో పరారయ్యారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది.

డ్రైవర్ మరొక వ్యక్తితో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు దోపిడీకి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

నగర నడిబొడ్డున, అదీ ఏటీఎం వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు దోపిడీ జరగడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.