ఖనిజాల భద్రతకు కొత్త దిశ..

భారత్–యూకే సంయుక్త అబ్జర్వేటరీ ప్రారంభం

ఓపెనింగ్ చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, యూకే ఫారిన్ సెక్రటరీ ఇవెట్

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : భారత్ – యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య వ్యూహాత్మక బంధంలో మరో కీలక మైలురాయి నమోదైంది. క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక రంగానికి అత్యంత కీలకమైన ‘భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ (GSCO)’ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, యూకే ఫారిన్ సెక్రటరీ ఇవెట్ కూపర్ గురువారం సంయుక్తంగా ప్రారంభించారు.
2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ నిర్ణయాల నేపథ్యంలో ఈ కేంద్రం రూపుదిద్దుకుంది.

*ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక: కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, స్థిరమైన, విశ్వసనీయమైన సప్లయ్ చైన్ వ్యవస్థను నిర్మించడంలో ఈ అబ్జర్వేటరీ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పనకు ఈ అబ్జర్వేటరీ ముఖ్య కేంద్రంగా మారుతుంది. భవిష్యత్తులో పరిశ్రమలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు అవసరమైన అద్భుతమైన సమాచారాన్ని అందించే గ్లోబల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఇది ఎదుగుతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించడమే లక్ష్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలంబనకు కేంద్రం పెద్దపీట వేస్తోందని మంత్రి వివరించారు. మినరల్స్ వెలికితీత, ఎక్స్‌ప్లొరేషన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఆవిష్కరణలను బలోపేతం చేసేందుకు 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33,000 కోట్లు) ‘జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్’ను ప్రారంభించినట్లు వెల్లడించారు. మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు 180 మిలియన్ డాలర్ల ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశామని, పారిశ్రామిక వ్యర్థాల నుంచి విలువైన మినరల్స్ సేకరించడం, విదేశాల్లో మినరల్స్ తవ్వకాలు జరపడం వంటి పనులు వేగవంతం చేశామని పేర్కొన్నారు. భారత క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బ్రిటిష్ పరిశ్రమలు, పెట్టుబడిదారులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

“యూకేకు ఉన్న అత్యాధునిక మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీ భారతదేశంలోని ఈవీ (EV), డిఫెన్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాల వేగవంతమైన ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుంది. పారదర్శకమైన ఈ-ఆక్షన్ విధానం, ప్రైవేట్, జూనియర్ మైనింగ్ కంపెనీలకు ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతులతో పెట్టుబడులకు భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా తీర్చిదిద్దుతున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యుల సమక్షంలో..
కేంద్ర గనుల శాఖ, ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్, టెక్స్‌మిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు చెందిన టెక్నాలజీ ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్ పార్క్, మరియు బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకే విదేశాంగ శాఖ ప్రతినిధులు, బ్రిటిష్ హై కమిషన్ అధికారులు, కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రతినిధులు మరియు భారత గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply