జొన్నల కొనుగోలు వేగవంతం చేయాలి

జొన్నల కొనుగోలు వేగవంతం చేయాలి

విట్టాపూర్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్ ఆడే కమల్ సింగ్

కుంటాల, ఆంధ్రప్రభ: కొనుగోలు కేంద్రాల్లో జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో కల్లాల వద్ద నిల్వ ఉన్న జొన్నల ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైతులకు గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. గడువులోగా ధాన్యాన్ని వేగంగా సేకరించి గోదాములకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదే విధంగా వరి ధాన్యాన్ని రేపటిలోగా రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారం రోజుల్లోపు ధాన్యం నిల్వలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి తరలించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి జొన్నలు తెలంగాణకు తీసుకువస్తే సంబంధిత రైతులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్ ఆధారంగా కొనుగోలు ప్రక్రియ చేపడతామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిందే లింగారం పటేల్, ఆర్‌ఐ ఆడెల్లు, సీనియర్ అసిస్టెంట్ మోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.