ఈదురుగాలులకు విరిడిపడిన చెట్లు.. గంటలపాటు విద్యుత్ అంతరాయం
ఈదురుగాలులకు విరిడిపడిన చెట్లు.. గంటలపాటు విద్యుత్ అంతరాయం
రామకృష్ణాపూర్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
రోడ్డుపై చెట్లు పడటంతో రాకపోకలకు ఆటంకం
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ): క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. రామాలయం సమీపంలోని ఠాగూర్ స్టేడియం పక్కన ఉన్న సివిల్ కార్యాలయ ప్రాంతంలో పెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెట్లు విద్యుత్ లైన్లపై పడటంతో ఆయా ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
