సాగునీటి కోసం పార్టీలకతీతంగా రైతులు పోరాడాలి

  • చెక్ డ్యామ్ల నిర్మాణంతోనే శాశ్వత పరిష్కారం
  • చల్లపల్లి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు

చల్లపల్లి, ఆంధ్రప్రభ: వ్యవసాయాన్ని బతికించుకోవాలంటే పార్టీలకు అతీతంగా రైతాంగం ఐక్యంగా ముందుకు సాగాలని, పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించుకోవడం ద్వారా మాత్రమే ప్రస్తుత పంటలను కాపాడుకోగలమని రైతు నాయకులు అభిప్రాయపడ్డారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సాగునీటి సమస్యలపై అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన రైతుసంఘం రాష్ట్ర నాయకులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ మాట్లాడుతూ, పులిచింతల నుంచి నీటి విడుదల జరిగితేనే డెల్టా ప్రాంతం బతుకుతుందని అన్నారు. ప్రభుత్వం కాలువలకు నీరు విడుదల చేయడంతో రైతులు నారుమడులు పోసుకున్నారని తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం, బండికోళ్లంక వద్ద చెక్ డ్యామ్లు నిర్మించడం ద్వారా మాత్రమే సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. యూరియా విక్రయానికి అమలు చేస్తున్న యాప్ విధానాన్ని రద్దు చేయాలని, పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని, కాలువలను ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, మురుగు కాలువలో తూటుకాడను తొలగించాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ, నీరు వస్తుందన్న నమ్మకంతో రైతులు నారుమడులు పోసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం పులిచింతలలో 29 టీఎంసీల నీరు ఉండగా, పట్టిసీమలో 20 మోటార్ల ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారని తెలిపారు. ఈ నీటిని కాలువలకు విడుదల చేస్తే సుమారు 57 రోజులపాటు వ్యవసాయానికి ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. 2003 కరువు సమయంలో పులిచింతల ప్రాజెక్టు లేకపోయినా రైతులు ఉద్యమించి నీటిని సాధించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన చెక్ డ్యామ్లు నిర్మిస్తేనే సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం వీటికి ఆమోదం తెలిపేలా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సీపీఐ సీనియర్ నాయకులు మాలెంపాటి కాంచనరావు మాట్లాడుతూ, అఖిలపక్ష నేతల నిర్ణయాలకు అనుగుణంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగిద్దామని అన్నారు. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా డెల్టా కేఈబీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కాజ్‌వే కమ్ చెక్ డ్యామ్ల నిర్మాణానికి ఇప్పటికే జీవోలు వచ్చినా అమలు కాలేదని, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పోలవరం ఎత్తును 45 మీటర్లకు పెంచితేనే శాశ్వతంగా నీటి ఎద్దడి సమస్య తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు.

రైతుసంఘం రాష్ట్ర నాయకులు మల్నీడు యలమందరావు మాట్లాడుతూ, కృష్ణా డెల్టా రైతాంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సాగునీటి సమస్యలపై విజయవాడలో సమావేశం నిర్వహించి ఈ నెల 5న ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడును కలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు జన్ను జగన్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం గురించి ఏడాదిగా హెచ్చరికలు వస్తున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యవసాయంపై తగిన ప్రాధాన్యత కనిపించడం లేదని విమర్శించారు. తొలిదశలో 25 టీఎంసీల నీటి విడుదలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుండటంతో సాగునీటి ప్రాధాన్యతలు మారిపోయాయని అన్నారు.

డీసీ చైర్మన్ నిడమానూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల నీటినిల్వలు, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. పులిచింతల నుంచి నీటి విడుదలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చని, అయితే భవిష్యత్తు తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టిసీమ నుంచి ప్రస్తుతం రోజుకు 7,057 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారని, కేఈబీ కెనాల్‌కు కనీసం 1,200 క్యూసెక్కుల నీరు అందిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, ఏపీఎస్‌ఐడీసీ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి, జిల్లా రైతుసంఘం కార్యదర్శి గుత్తికొండ రామారావు, ఎంఎల్ పార్టీ నాయకుడు పరుచూరి జనార్ధన్, రైతు నాయకులు రేపల్లె యోగప్రకాష్, పరుచూరి రాఘవేంద్రరావు ప్రసంగించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతుసంఘం ప్రతినిధులు మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, వేమూరి రత్నగిరిరావు, పెనుమత్స రాజారత్నం, మీర్ రిజ్వాన్, యద్దనపూడి మధు, మద్దిపట్ల జగన్మోహనరావు, నాదెళ్ల వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.