ఎట్టకేలకు ఇద్దరు టీచర్లకు డిప్యూటేషన్..

  • తిమ్మాపూర్ స్కూల్లో వివాదం..
  • వేరే స్కూళ్లలో తక్షణమే చేరాలని ఆదేశాలు..

జన్నారం, ఆంధ్రప్రభ : ఎట్టకేలకు ఆ ఇద్దరు టీచర్లకు డిప్యూటేషన్ పై వేరే పాఠశాలలకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జన్నారం మండలంలోని తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు రాథోడ్ రాజును,ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఆగిడి సురేందర్ ను డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలకు బదిలీ చేస్తూ ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు.

గత వారం రోజుల క్రితం తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల,తల్లిదండ్రుల మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో స్థానిక ఎంఈఓ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి (డీఈవో )పి. చంద్రయ్య,ఆ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

హిందీ స్కూల్ అసిస్టెంట్ రాజును జిల్లాలోని నెన్నెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు,ఎస్జీటీ ఉపాధ్యాయుడు సురేందర్ ను కోటపల్లి మండలంలోని నాగంపేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపిస్తూ,తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా ఇన్చార్జి డీఈవో ఆదేశించారని స్థానిక ఎంఈఓ బానావత్ రాజేందర్ తెలిపారు.

రిలీవైన ఇద్దరు ఉపాధ్యాయులు..

వివాదం వ్యవహారంలో తిమ్మాపూర్ పాఠశాల నుంచి ఆ ఉపాధ్యాయులు రాజు, సురేందర్ లు రిలీవైనట్లు స్థానిక ఎంఈఓ రాజేందర్ శనివారం తెలిపారు.ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఆదేశాలు అందజేస్తూ ఇక్కడి నుంచి రిలీవ్ చేశామన్నారు.

10న ఆ వివాదంపై విచారణ..

తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన వివాదం వ్యవహారంలో జిల్లా డీఆర్డీఓ కిషన్ ను ఈ నెల 10న విచారణ జరిపి,నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారని స్థానిక ఎంఈఓ రాజేందర్ తెలిపారు. ఈ మేరకు ఆ పాఠశాల ఆవరణలో ఈనెల 10న ఉదయం 10 గంటలకు జరిగే విచారణకు మండలంలోని తపాల్ పూర్ స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి హెచ్ఎం తిరుపతి,ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆర్.రాజు,ఎ.సురేందర్,బీన, తాను హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు.ఆ విచారణ లేఖలను తాను తీసుకొని,వారందరికీ అందజేసినట్లు ఆయన తెలిపారు.