కొణతాలపల్లి ఆలయ పునరుద్ధరణకు అదనపు నిధులు

మంజూరు పత్రాన్ని గ్రామస్తులకు అందజేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు, ఆంధ్రప్రభ : పురాతన ఆలయాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. సోమవారం వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలోని శ్రీ గంగ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ జీవనోద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1.21 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఆ మంజూరు పత్రాన్ని గ్రామస్తులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణానికి గతంలో రూ.92 లక్షలు మంజూరు చేసినప్పటికీ, పూర్తిస్థాయి నిర్మాణ పనులకు మరిన్ని నిధులు అవసరమని గుర్తించి ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించిందన్నారు. సెకండ్ సీఎజీఎఫ్ గ్రాంట్ కింద రూ.1.21 కోట్లను మంజూరు చేయించినట్లు తెలిపారు.

ఈ అదనపు నిధుల మంజూరుకు ప్రత్యేకంగా కృషి చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్, కాపా రాంబాబు, జనసేన నాయకుడు బొమ్మిశెట్టి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారంతో కొణతాలపల్లిలోని పురాతన శ్రీ గంగ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం త్వరలో మరింత సుందరంగా రూపుదిద్దుకుంటుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.