దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది..
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది..
- రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ, దివ్యాంగులు తమ సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 11 వేల దివ్యాంగ పొదుపు సంఘాల ద్వారా సుమారు 80 వేల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీలో ఉన్న కఠిన నిబంధనలను సడలించడం వల్ల మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. అలాగే ఆరు సంవత్సరాల లోపు దివ్యాంగ చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి కోసం బాల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
దివ్యాంగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రభుత్వం దివ్యాంగులకు స్కూటీలు, అడ్వాన్స్డ్ వీల్చైర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలను ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. వీటి ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.
ఈ సందర్భంగా అర్హులైన పలువురు దివ్యాంగులకు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, అడ్వాన్స్డ్ వీల్చైర్లు పంపిణీ చేశారు.
అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి 38 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ప్రత్యేక స్కూటీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినూత్న, ఇతర అధికారులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
