ఆగస్టు 5 నుంచి ఏపీ టెట్ పరీక్షలు

  • పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..
  • అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్–జూన్ 2026) పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో ఐఓఎన్ డిజిటల్ జోన్, కనూరు (సెంటర్ కోడ్–8031), శ్రీ వాసవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరు (సెంటర్ కోడ్–1415) కేంద్రాల్లో ఆగస్టు 5 నుంచి 16 వరకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,307 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని సూచించారు.

పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్–144 అమలు చేసేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని, అభ్యర్థుల సెల్‌ఫోన్ల భద్రత కోసం ప్రత్యేక మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ట్రాన్స్‌కో అధికారులు పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులు అభ్యర్థుల రాకపోకలకు అనుగుణంగా అవసరమైన బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది, మెడికల్ కిట్‌లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

దివ్యాంగ అభ్యర్థులకు అవసరమైన లేఖరులు (స్క్రైబ్స్) అందుబాటులో ఉండటంతో పాటు అదనపు లేఖరులను కూడా సిద్ధంగా ఉంచాలని, పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే అన్ని శాఖల అధికారులు నిర్ణీత సమయానికి ముందుగానే హాజరై పరస్పర సమన్వయంతో పనిచేసి ఏపీ టెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు.