పోలవరం ముంపుపై సమగ్ర నివేదిక..
- తెలంగాణ వాదనలకు సాంకేతిక బలం కావాలి
- కేంద్రం ముందు బలంగా వినిపించాలి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణలో ఏర్పడే ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూములు, గ్రామాలు, ప్రజా మౌలిక సదుపాయాలు, ఇతర ఆస్తులు ఎంత మేర ముంపునకు గురయ్యే అవకాశం ఉందో ముందస్తుగా అంచనా వేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ వాదనలకు క్షేత్రస్థాయి సమాచారం, సాంకేతిక అధ్యయనాలు, ఆర్థిక నష్టం అంచనాలు వంటి విశ్వసనీయ ఆధారాలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు సంబంధిత సంస్థల ముందు బలంగా ప్రస్తావించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పోలవరం ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావంతో నష్టపోయే భూములు, మౌలిక సదుపాయాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన పరిహారం చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలదేనని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అంచనాలను త్వరగా పూర్తి చేసి, తెలంగాణ తరఫు వాదనలు అధికారికంగా సంబంధిత వేదికల ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్‌సీ (జనరల్) ఓ.వి. రమేశ్‌బాబు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, ఈఎన్‌సీ (అడ్మిన్) పి. శ్రీనివాస్, ఈఎన్‌సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఆర్. మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.
