Crop-Holiday : కౌల‌న్న క్రాప్ హాలిడే.. Andhra Prabha Exclusive Story

Crop-Holiday : కౌల‌న్న క్రాప్ హాలిడే.. Andhra Prabha Exclusive Story

  • ఎల్‌నీనో గ్రహణంతో దుక్కికి దూరం
  • మూడో వంతు పొలాల‌కు సెల‌వు

( ప‌ల్నాడు బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌) :

సాగు హక్కు లేదు… ఇచ్చే చేయూత లేదు… ఆరుగాలం కష్టపడి పండించే పంటకు గిట్టుబాటు ధర దక్కక, చివరకు ప్రకృతి విపత్తులొచ్చినా రూపాయి పరిహారం అందక కౌలు రైతు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాడు! వీటికి తోడు ఈసారి ఎల్‌నీనో రూపంలో వచ్చిపడిన ఉపద్రవం కౌలు సాగును కోలుకోలేని దెబ్బతీసింది. అప్పుల ఊబిలో చిక్కుకుని బ్రతుకునీడ్చేకంటే… వ్యవసాయానికి దండం పెట్టి, కాడి పక్కనపడేసి దినసరి కూలీలుగా మారిపోవడమే మేలని కౌలు రైతులు సాగుకు విరామం ప్రకటిస్తున్నారు.
పంట పొలం లేక‌పోయినా వ్య‌వ‌సాయం మీద మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ లేక కాడి వదిలేస్తున్నారు. రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. కౌలు ఒప్పందాలన్ని నోటి మాట మీద జరగుతున్నాయి. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా రైతులకు అందే ఏ సాయం కౌలు రైతులకు అందడం లేదు. భూమిపై ఎలాంటి హక్కు లేని కౌలు దారులకు ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత అందక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప‌ల్నాడు జిల్లాలో దాదాపు 40 శాతం మేర సాగు భూమి కౌలురైతుల చేతిలో సాగవుతున్నది. అయినా ప్రభుత్వం వారిపై కనికరం చూపడం లేదు.

Crop-Holiday : క‌ష్టాల సేధ్యం

కౌలు రైతులకు అంతో ఇంతో ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందడానికి సీసీఆర్‌సీ (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్)నే ప్రమాణికం. రాయితీ ఎరువులు మొదలుకొని బ్యాంకుల రుణాల వరకు ఈ కార్డే ఆధారం. వీటిని జారీ చేసేందుకు.. ప్రభుత్వం జిల్లా వారీగా భారీ లక్ష్యాలను మూడు నెలల క్రితమే వ్యవసాయశాఖకు నిర్దేశించింది. కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు ఇచ్చేందుకు.. సహకరించని భూ యజమానులకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల పంట పెట్టుబడి సాయం, రుణాలు, బీమా, ప్రకృతి విపత్తుల పరిహారం వంటి ప్రభుత్వ ప్రయోజనాలు చాలా మందికి అందడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా కౌలు రైతులు ఆశలు పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. భూ యజమానుల సహకారం పక్కనబెడితే.. తాజాగా ఎల్‌నివో రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. దీంతో సీసీఆర్‌సీ లక్ష్యాలు చేరుకోవడంపై వ్యవసాయశాఖ దాదాపుగా ఆశలు వదిలేసుకున్న పరిస్థితులే కనబడుతున్నాయి.

ల‌Crop-Holiday : క్ష్యం ఆమ‌డ దూరం

కౌలు రైతులకు సాగు హక్కు పత్రాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం భారీగానే ఉంది. ఇందులో కార్డులు రెన్యువల్ చేయించుకునేవారు పోగా.. స్వల్ప సంఖ్యలో కొత్త కార్డులు మంజూరు చేస్తే సులభంగా లక్ష్యాలు చేరుకోవచ్చని తొలుత వ్యవసాయశాఖ భావించింది. కానీ, ఎల్ నివో ఎఫెక్ట్‌తో.. కౌలు సాగు లోనే దాదాపు 30 శాతం కోత పడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో సీసీఆర్‌సీలు రెన్యువల్ చేసుకునే కౌలుదారుల సంఖ్య కూడా అదే స్థాయిలో పడిపోతోంది. దీనికి తోడు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రభావం వల్ల ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏటా జూలై ఆఖరుకే దాదాపు సీసీఆర్‌సీ కార్డుల జారీ ఓ కొలిక్కి వచ్చేది. ఈ పరిస్థితుల అన్నింటి ప్రభావంతో ప్రస్తుతం టార్గెట్‌లో 30 శాతం కూడా చేరుకోలేని పరిస్థితి కనబడుతోంది.ప‌ల్నాడు జిల్లా లక్ష్యం 70 వేలు కాగా, జారీ చేసింది కేవలం 13,553 మాత్రమే. గతేడాది కౌలు సాగు హక్కు పత్రాల జారీ లక్ష్యాలను వ్యవసాయశాఖ చేరుకోలేక పోయినప్పటికీ 80 శాతం పూర్తి చేశారు. చాలా వరకు కార్డుల రెన్యువల్స్ ఉండడంతో పని తేలికయ్యింది. ఆగస్టులో కూడా చాలా వరకు రెన్యువల్స్ గతేడాది జరిగాయి. ఈసారి రెన్యువల్స్‌లో కూడా భారీగా కోత పడనుంది. ఆ కార్డుల స్థానంలో కొత్తవాటిని వేరే కౌలు రైతులకు వ్యవసాయశాఖ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, ఈసారి లక్ష్యాల్లో 60 శాతం చేరుకుంటే గగనమనే మాటలు వ్యవసాయశాఖ నుంచే వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం సీసీఆర్‌సీ కార్డు కౌలు రైతులకు అందజేయాలంటే భూ యజమాని కౌలుకు ఇచ్చినట్టు సాగుహక్కు అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో భూ యజమాని ఎటువంటి సంతకం పెట్టకపోయినా గుర్తింపు కార్డు ఇచ్చేవారు. కొత్త నిబంధనల ప్రకారం సంతకంతో పాటు ఇతర వివరాలు భూ యజమాని ఇవ్వాల్సి ఉండడంతో తిరస్కరిస్తున్నారు. భూ యజమానులు అంగీకరించకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, సాంకేతిక చిక్కుల కారణంగా అనేక మంది కౌలు రైతులు నమోదు కాకుండానే మిగిలిపోతున్నారు.

Crop-Holiday : అన్నీ ఇబ్బందులే

బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. మరోవైపు గుర్తింపు కార్డులున్నా, రుణాల మంజూరులో ఆలస్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు . గత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.200 కోట్ల లోపే కావడం గమనార్హం. ప్రభుత్వం రూ.500 కోట్ల వరకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదే తరహాలో విత్తనాలు, ఎరువులు రాయితీల్లో కూడా తమకు సీసీఆర్‌ కార్డ్డు ఉన్నప్పటికీ ప్రభుత్వం చెప్పిన స్థాయిలో మేలు జరగడం లేదనే ఆవేదన వారిలో ఉంది విధి లేక అధిక వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకొని సాగు చేస్తున్నారు. పంట నష్టపోతే అప్పుల భారం మరింత పెరుగుతోంది. తుఫాన్లు, భారీ వర్షాలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టపోయిన అనేకమంది కౌలు రైతులకు పరిహారం అందడం లేదు. భూమి యజమానుల పేర్లే అధికారిక రికార్డుల్లో ఉండడంతో ఆరుగాలం చమటోడ్చి సాగు చేసిన కౌలు రైతులు మాత్రం ప్రభుత్వం అందించే సాయానికి దూరమవుతున్నారు. పంటల బీమా ప్రయోజనాలు కూడా పరిమితంగానే అందుతున్నాయి. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కౌలు రైతులు రెండు విధాలా నష్టపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. కౌలు చెల్లింపులు, అప్పుల వడ్డీలు, కటుంబ ఖర్చులు భరించలేక కొందరు రైతులు సాగును వదిలేసి, పారిశ్రామిక వాడల్లో దినసరి కూలీలుగా వెళ్లిపోతున్నారు.కౌలు రైతులకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పెట్టుబడి సాయం భూ యజమానుల ఖాతాల్లో నేరుగా జమవుతోంది. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పు ల పాలవుతున్నారు. ప్రభుత్వం ఆ న్‌లైన్‌ విధానంలో రైతులకు ఎరువులను సరఫరా చేస్తుండటంతో కౌలు రైతులకు అందక పంట దిగుబడి కూడా తగ్గిందనే చెప్పవచ్చు. పండిన కొద్దిపాటి పంటను విక్రయించేందుకు భూ యా జమాన్య హక్కులు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టాల పాలయ్యారు. కొందరు భూ యజమానులు, ఇతరులను ప్రాధేయపడి పంట ఉత్పత్తులను అమ్ముకున్నారు. భూ యజమానుల ఖాతాల్లో జమ అయిన నగదును సకా లంలో కౌలు రైతులకు బదిలీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలున్నాయి.

Crop-Holiday : ఎల్‌నీవోతో కొత్త క‌ష్ట‌కాలం

ఇన్ని క‌ష్గాల మ‌ధ్య సాగుకు సంసిద్ద‌మౌదామ‌నుకున్నా.. ఈ ఏడాది ఎల్‌నివో ప్ర‌భావంతో కౌలు రైతులు సాగుకు ఆస‌క్తి చూప‌లేదు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కౌలు రైతులకు ఈ ఏడాది ఎల్‌నీనో గట్టి షాక్ ఇచ్చింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో సాగు ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఎల్‌నీనో ఎఫెక్ట్ వల్ల ఒక్క కౌలు సాగులోనే దాదాపు 30 శాతం మేర కోత పడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. వర్షాలు నమ్మదగ్గ స్థితిలో లేకపోవడంతో, మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే మునిగిపోతామనే భయంతో కౌలు రైతులు ఈ ఏడాది సాగుకు దూరంగా ఉంటున్నారు.

కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వడంలో ఉన్న క్లిష్ట నిబంధనలను సడలించి, భూ యజమానులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎల్‌నీనో వంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకరూపంలో బ్యాంకింగ్ రుణాలు, ఇన్స్యూరెన్స్ పెట్టుబడి రాయితీలు నేరుగా కౌలుదారులకే అందేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలి. లేనిపక్షంలో, వ్యవసాయంలో అత్యధిక భాగం సాగు చేస్తున్న కౌలు రైతులు పూర్తిగా కాడి వదిలేస్తే.. భవిష్యత్తులో తీవ్ర ఆహార భద్రత లోపించడమే కాక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమయ్యే ప్రమాదం ఉంది.