లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాలి
- జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
- అప్రోచ్ రోడ్డు నిర్మాణం తప్పనిసరి
- ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు ఇవ్వొద్దు
ఖమ్మం, ఆంధ్రప్రభ: లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.పెండింగ్‌లో ఉన్న లేఔట్ దరఖాస్తులపై రెవెన్యూ, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లేఔట్ అనుమతుల కోసం వచ్చిన 17 దరఖాస్తులను కమిటీ పరిశీలించిందన్నారు. అనుమతులు మంజూరు చేసే సమయంలో నీటి వనరుల పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్), రక్షిత పరిధి (బఫర్ జోన్)లోకి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.లేఔట్‌కు అనుసంధాన రహదారి కనీసం 18 మీటర్ల వెడల్పుతో ఉండాలని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని లేఔట్‌లో కేటాయించేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
లేఔట్ ప్రాంతం నీటి వనరులు, నీటి ప్రవాహ మార్గాలకు నిర్దేశించిన దూరంలో ఉండాలని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు జారీ చేయరాదని స్పష్టం చేశారు.అదనపు సర్వే భూ రికార్డుల అధికారి, మండల సర్వేయర్, ఆర్డీవోలు సంయుక్తంగా దరఖాస్తు ప్రాంతంతో పాటు పరిసర సర్వే నంబర్లను పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు.
గతంలో అక్కడ ఏవైనా నీటి వనరులు ఉన్నాయా అనే అంశాన్ని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లేఔట్ అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు జారీ చేయాలని చెప్పారు. అలాగే అనుమతుల షరతులను అభివృద్ధి పనుల సమయంలో అమలు చేస్తున్నారో లేదో పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ పారస్ కుమార్, ఎస్‌డీసీ సదానందం, నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్‌ఈ యాకోబు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, సుడా సీపీఓ రాజ్‌కుమార్, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
