కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షలపై ఎమ్మెల్యే ఆగ్రహం

  • టైగర్ జోన్ ఆంక్షలు ఎత్తేయాలి..
  • ఆదివాసీలకు న్యాయం చేయాలి..
  • అటవీ శాఖకు హెచ్చరిక
  • 24 గంటల్లో చర్యలు లేకుంటే ఉద్యమం ఉధృతం

జన్నారం, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో అమలవుతున్న ఆంక్షలను సడలించకపోతే అటవీ అధికారులపై సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. అటవీ అధికారులకు నిత్యావసర సరుకులు ఎవరూ అందించవద్దని, ఆదివాసీల సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.

సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్టులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు అటవీ అధికారులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మంచిర్యాల సీఎఫ్, ఎఫ్‌డీపీటీ శాంతారాంతో పాటు మరికొందరు అటవీ అధికారులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇందనపల్లి నాయకపుగూడకు చెందిన ఆరుగురు ఆదివాసీ యువకులపై దాడి చేసిన ఇందనపల్లి ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను 24 గంటల్లో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తాను ప్రభుత్వానికి వ్యతిరేకి కాదని, అటవీ శాఖలోని కొందరు అధికారుల తీరును మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తినని, ప్రజల పక్షాన చివరివరకు పోరాడతానని అన్నారు. 24 గంటల గడువు ముగిసిన తర్వాత ప్రజల ప్రయోజనాల కోసం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్, జిల్లా నాయకులు మోహన్ రెడ్డి, ఇసాక్, ముజాఫర్, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు బొంతల లక్ష్మణ్, శంకరయ్య, భూమేష్, లక్ష్మణ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.