రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం..

  • బిజెపి పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్.

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు గోదావరి జలాలు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్ విమర్శించారు.

శుక్రవారం జూలూరుపాడు గ్రామంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఇప్పటికీ వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, సాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు అందిస్తామని ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతానికి సాగునీరు వస్తుందని ఆశించిన రైతులకు అన్యాయం చేస్తూ, గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ కెనాల్, ఏన్కూర్ లింక్ కెనాల్ నిర్మాణం కోసం జూలూరుపాడు మండల రైతులు తమ భూములను కోల్పోయారని పేర్కొన్నారు.

ఎటువంటి అనుమతులు లేకుండా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నుంచి ఏన్కూర్ లింక్ కెనాల్‌ను నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుసంధానం చేశారని ఆరోపించారు. కేవలం రెండు నెలల్లో లింక్ కెనాల్ నిర్మించి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు తరలిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జూలూరుపాడు మండల రైతులకు చుక్క సాగునీరు కూడా అందలేదని విమర్శించారు. లింక్ కెనాల్ ప్రారంభోత్సవ సమయంలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు నిర్మించి మండలానికి సాగునీరు అందిస్తామని వైరా ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఎద్దేవా చేశారు.

ఏన్కూర్ లింక్ కెనాల్ ప్రారంభమై ఏడాది దాటినా చెరువులు నింపే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తి కాలేదని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి అన్యాయం చేసి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రాంతాలకు గోదావరి జలాలు మళ్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు అందించాలని, లేకపోతే రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చిలుకూరి రమేష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య రమేష్, మాజీ మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, నర్వనేని కృష్ణ, వెంకటేశ్వర్లు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.