ఎల్‌బీఆర్‌సీఈ విద్యార్థినికి అరుదైన గుర్తింపు

మైలవరం,ఆంధ్రప్రభ: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎం.టెక్ (వీఎల్‌ఎస్‌ఐ & ఎంబెడెడ్ సిస్టమ్స్) ప్రథమ సంవత్సరం విద్యార్థిని తునికిపాటి హర్షితకు భారతీయ స్టేట్ బ్యాంకు ప్లాటినం జూబ్లీ ఆశా ఉపకార వేతనం కింద రూ.1,36,500 మంజూరైంది. ఉపకార వేతన మంజూరు పత్రాలను కళాశాల అధ్యక్షుడు జి. శ్రీనివాసరెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అప్పారావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ జి. శ్రీనివాసులు, ఉపకార వేతనాల సమన్వయకర్త గూడూరు నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ ఉపకార వేతనం కళాశాల విద్యార్థులు ఇప్పటివరకు పొందిన అత్యధిక ఉపకార వేతనమని గూడూరు నాగిరెడ్డి తెలిపారు. హర్షిత సాధించిన ఈ అరుదైన గుర్తింపుపై కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.