Modi in VivaTech-2026 | భారత్-యూరప్ వాణిజ్యానికి కొత్త దారులు..

ఆంధ్రప్రభ: యూరప్‌లో అతిపెద్ద సాంకేతిక, స్టార్టప్ ప్రదర్శన అయిన వివాటెక్-2026లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, నిర్వాహకులకు అభినందనలు తెలిపిన మోదీ.. భారత్-యూరప్ సంబంధాల్లో 2026 ప్రత్యేక సంవత్సరమని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరిందని గుర్తుచేశారు.

ఈ ఒప్పందంతో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరింత విస్తరించడమే కాకుండా ప్రతిభ, సాంకేతికత, పర్యాటక రంగాల్లో సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్-2026 ప్రారంభంతో ఫ్రాన్స్.. భారత్, యూరప్ సాంకేతిక వ్యవస్థల మధ్య కీలక వారధిగా మారిందని మోదీ అన్నారు. ఇటీవల నీస్‌లో నిర్వహించిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమం నుంచి పారిస్‌లోని వివాటెక్ వరకు భారత స్టార్టప్‌లు కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయని పేర్కొన్నారు.

సాంకేతికత, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల రంగంలో భారత్ వేగంగా ఎదుగుతోందని, ప్రపంచ పెట్టుబడిదారులు భారత అవకాశాలను వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్-యూరప్ భాగస్వామ్యం భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.