శ్రీశైలంలో దత్తాత్రేయస్వామికి ప్రత్యేక విశేషపూజలు
శ్రీశైలంలో దత్తాత్రేయస్వామికి ప్రత్యేక విశేషపూజలు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో లోకకల్యాణం కోసం గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి దేవస్థాన సేవలో భాగంగా ప్రతి గురువారం నిర్వహించే సర్కారీ సేవను శాస్త్రోక్తంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి, అనంతరం పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు జరిపినట్లు వెల్లడించారు.
లోకోద్ధరణ కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకస్వరూపంగా దత్తాత్రేయునిగా అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడిగా ప్రసిద్ధి చెందారు.
శ్రీశైల క్షేత్రానికి దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అనుబంధం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయుడు తపస్సు చేసినట్లు ప్రతీతి. ఈ కారణంగానే ఆ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షంగా భక్తులు భావిస్తారు.
కలియుగంలో గోదావరి తీరంలోని పిఠాపురంలో దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభునిగా అవతరించారని గురుచరిత్ర పేర్కొంటుంది. శ్రీపాద వల్లభుడు ఒక సందర్భంలో శ్రీశైల క్షేత్రంలో చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లు కూడా గ్రంథాల్లో ప్రస్తావన ఉంది.
తీర్థక్షేత్రాల మహిమను శిష్యులకు వివరించే సమయంలో శ్రీపాద వల్లభుడు శ్రీశైలాన్ని పలుమార్లు ప్రస్తావించినట్లు చెబుతారు. అనంతరం మహారాష్ట్రలోని కరంజా నగరంలో నృసింహ సరస్వతి స్వామిగా దత్తాత్రేయుని అవతారం కొనసాగినట్లు గురుచరిత్ర వివరిస్తుంది.
నృసింహ సరస్వతి స్వామి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవించినట్లు కూడా ప్రస్తావన ఉంది. తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగ వద్దే చేసినట్లు భక్తుల విశ్వాసం.
కలియుగ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులను అదృశ్య రూపంలో రక్షించాలని సంకల్పించిన నృసింహ సరస్వతి స్వామి, నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చినట్లు గురుచరిత్రలో పేర్కొన్నారు. కదళీవనం సమీపంలో అరటి ఆకులతో చేసిన ఆసనంపై కూర్చొని కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ప్రయాణించిన అనంతరం అదృశ్యమైనట్లు ఆ గ్రంథం వివరిస్తోంది.
