బర్త్డే వేడుకలకు ఫ్యామిలీ ట్రిప్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనితో కలిసి పుట్టినరోజు వేడుకల కోసం విదేశీ విహారయాత్రకు బయలుదేరారు. హైదరాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కనిపించగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఎప్పటిలాగే సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపించిన మహేష్ బాబును అభిమానులు, ఫొటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. కుమారుడు గౌతమ్ ఘట్టమనేనితో కలిసి ఆయన ఎయిర్పోర్ట్లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లే మహేష్ బాబు.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రత్యేక వేడుకలకు సిద్ధమవుతుండగా, ఆయన విదేశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను జరుపుకోనున్నారు.
ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నారు. భారీ యాక్షన్–అడ్వెంచర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచి కలిసి కథను రూపొందించగా, అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా ‘వారణాసి’ నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
