Indrakeeladri | కోలాహలంగా అమ్మవారికి ఆషాడసారే..

ఇంద్రకీలాద్రిపై భక్తుల వెల్లువ..
ఒక్కరోజే 37,071 మంది అమ్మవారి దర్శనం..
48 సారె బృందాలతో ఆషాఢ ఉత్సవాలు
దసరా మహోత్సవాలపై పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ..
భద్రత, ట్రాఫిక్, రద్దీ నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ
సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కీలక దశ పూర్తి..
విద్యుత్ స్వయం సమృద్ధి దిశగా ఇంద్రకీలాద్రి మరో ముందడుగు
శాకంభరీ ఉత్సవాల దాతలకు ప్రత్యేక సన్మానం..
ఎంపీ కేశినేని చిన్ని జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి రోజురోజుకూ పెరుగుతోంది. ఆషాఢ సారె ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలిరాగా, ఒక్కరోజే 37,071 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు శరన్నవరాత్రి దసరా మహోత్సవాల నిర్వహణకు పోలీసులు, దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేయగా, విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఒక మెగావాట్ సోలార్ ప్రాజెక్టు కీలక దశను పూర్తి చేసింది.

వైభవంగా ఆషాడ సారె ఉత్సవాలు..

ఆషాఢ సారె ఉత్సవాల 20వ రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 48 సారె బృందాల ద్వారా 18,432 మంది మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, గాజులు సమర్పించారు. సారె బృందాలకు ఉచిత దర్శనం, వేదాశీర్వచనంతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదే రోజు మొత్తం 37,071 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 9,475 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

దసరా ఏర్పాట్లు..

శరన్నవరాత్రి దసరా మహోత్సవాల దృష్ట్యా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఇంద్రకీలాద్రిపై క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. ఈవో వి.కె. సీనా నాయక్‌తో కలిసి దుర్గాఘాట్, ఇరిగేషన్ ఘాట్ ప్రాంతాలను పరిశీలించి భక్తుల భద్రత, ట్రాఫిక్, రద్దీ నియంత్రణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఇంద్రకీలాద్రికి సోలార్ వెలుగులు..

ఇక దేవస్థానం పాతపాడులో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు విద్యుదీకరణ విజయవంతంగా పూర్తికాగా, ఏబీటీ మీటర్ల ఏర్పాటు అనంతరం నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. దీంతో దేవస్థానానికి విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గనుంది.

దాతలకు సన్మానం..

ఇటీవల వైభవంగా నిర్వహించిన శాకంభరీ మహోత్సవాలకు కూరగాయలు, పండ్లు విరాళంగా అందించిన దాతలను దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. సీనా నాయక్ ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.

ఎంపీ చిన్ని పుట్టిన రోజు వేడుకలు…

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆధ్యాత్మిక సేవలను మరింత విస్తరిస్తోంది.