డైలీ ఫైనాన్స్ వేధింపులు ఆగాలి
- డైలీ ఫైనాన్స్, ఈఎంఐ వేధింపులపై చర్యలు తీసుకోండి
- రూరల్ సీఐకి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ వినతి
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: మల్యాల గ్రామంలో కాల్‌మనీ, డైలీ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు స్పందించారు. వడ్డీ వ్యాపారాలు, డైలీ ఫైనాన్స్, ఈఎంఐ రుణాల వసూళ్ల పేరుతో జరుగుతున్న చట్టవిరుద్ధ ఒత్తిళ్లు, బెదిరింపులు, వేధింపులను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ గురువారం నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన సీఐ సుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందిస్తూ నాలుగు మండలాల పరిధిలోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల మేనేజర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, రుణగ్రస్తులపై చట్టవిరుద్ధంగా ఒత్తిళ్లు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే సహించబోమని కఠినంగా హెచ్చరిస్తామని హామీ ఇచ్చారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలు రుణాల వసూళ్ల పేరుతో తీవ్ర మానసిక వేధింపులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మల్యాల ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, చట్టవిరుద్ధ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలు, గౌరవం కంటే ఏ ఆర్థిక లావాదేవీ గొప్పది కాదని పేర్కొన్న ఆయన, డైలీ ఫైనాన్స్, ఈఎంఐ వసూళ్ల పేరుతో జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాటేపోగు సోమన్న, వడ్డే సుధాకర్, మహిళా సంఘం నాయకులు ఎస్. బేబీ, బి. లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ ఘటనను ఆంధ్రప్రభ దినపత్రిక జూలై 29 సంచికలో “కాల్‌మనీ భూతం.. ఫైనాన్స్ వేధింపులకు నిండు కుటుంబం బలి” శీర్షికతో ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే.
