జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: బెంగళూరులో ఈనెల 7న నిర్వహించనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను విజయవంతం చేయాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ గాంధీ పార్క్‌లో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బండిగారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీల ఐక్యత ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ ఆలే చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సిలువేరు శ్రీనివాస్, బీసీ యువజన సంఘం నాయకుడు ఉష్కాగుల నాగరాజు, క్లాత్ షోరూం అధ్యక్షుడు కర్నాటి శ్యాంసుందర్, నాయకులు ప్రవీణ్, నవీన్, ప్రదీప్, ఆకాష్, అరవింద్, సుధీర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.