గ్రామాభివృద్ధే లక్ష్యం.. పార్టీలకు అతీతంగా సమిష్టి కృషి
ఊట్కూర్, ఆంధ్రప్రభ: పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజల సహకారంతో సమిష్టిగా పనిచేస్తామని అవుసలోనిపల్లి సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్య, నారాయణపేట జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్కోటి చెన్నప్ప అన్నారు. మంగళవారం అవుసలోనిపల్లి గ్రామంలో ఎల్కోటి చెన్నప్ప ఎన్నిక సందర్భంగా గ్రామ వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, విద్య, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు సూచనలు, సలహాలు అందిస్తూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాదురిక, వార్డు సభ్యులు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
